కృష్ణలంక : ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు సేవా భావంతో వైద్యసేవలందించాలని కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ వైద్యాధికారులను ఆదేశించారు. జిల్లాలోని వైద్యాధికారులు, ప్రైవేటు ఆసుపత్రి వైద్యులతో మాతాశిశు మరణాలపై కలెక్టర్ గురువారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులు, పీహెచ్‌సీలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల్లో గర్భిణుల వివరాలను అంగన్‌వాడీ కార్యకర్తలు నమోదు చేసి వైద్య సహాయాన్ని, పోషకాహారాన్ని అందించేందుకు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. గర్భిణుల్లో రక్తహీనతను తగ్గించేందుకు వాడే మందులను నిర్ణీత సమయంలో అందించాలని సూచించారు.
డిసెంబర్ 1 నుంచి గర్భిణులకు కలర్ కోడింగ్ అమలు
ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే గర్భిణులకు వారి ఆరోగ్య స్థితిని బట్టి సత్వర వైద్యం అందేలా కలర్ కోడింగ్‌ను డిసెంబర్ 1 నుంచి జిల్లాలో వినూత్నంగా అమలుపరుస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ విధానం తమిళనాడులో మంచి ఫలితాలను సాధించినందున జిల్లాలో కూడా అమలుపరచేందుకు నిర్ణయించినట్లు చెప్పారు. ఆసుపత్రులకు వచ్చే గర్భిణులకు వారి ఆరోగ్య స్థితినిబట్టి ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల వస్త్రాలతో కలర్ కోడింగ్‌ను ఇచ్చి ప్రాధాన్యక్రమంలో అత్యవసర వైద్యాన్ని అందిస్తారని పేర్కొన్నారు. జిల్లాలో లక్షమంది గర్భిణుల్లో 70మంది మరణిస్తున్నారని, ఈ రేటును గణనీయంగా తగ్గిచాలని ఆదేశించారు.
నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు
ప్రభుత్వం ఇటీవల అదనపు వైద్య సిబ్బందిని నియమించిందని, ప్రతి గ్రామంలోనూ ప్రభుత్వ వైద్య సేవలు ప్రజలకు అందాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని వైద్యాధికారులను హెచ్చరించారు. జిల్లాలోని మాతాశిశు మరణాల రేటును తగ్గించేందుకు ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు కృషి చేయాలని చెప్పారు. జిల్లా వైద్యాధికారి టీవీఎస్ మూర్తి, బీసీ వెల్ఫేర్ డిప్యూటీ డైరక్టర్ భార్గవి, ట్రైనీ కలెక్టర్ అంజలీ అనుమప, వైద్యులు సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.