అనకాపల్లి దివ్యాంగులను గుర్తించి వారికి పింఛన్ అందించేలా సదరం శిబిరాలు ఏర్పాటు చేయాలన్న సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు నియోజకవర్గానికి ఒకటి చొప్పున సదరం కేంద్రాలు ప్రారంభిస్తున్నట్లు జిల్లా వైద్యవిధాన పరిషత్ సమన్వయకర్త డాక్టర్ నాయక్ తెలిపారు. గ్రామీణ జిల్లాలోని అనకాపల్లి, నర్సీపట్నం ఆసుపత్రుల్లో ఇప్పటివరకు ఆధార్ కేంద్రాలను నిర్వహించే వారమన్నారు. ప్రతి శుక్రవారం మీ-సేవలో దరఖాస్తు చేసుకున్న దివ్యాంగుల వైకల్య శాతాన్ని వైద్యులతో గుర్తించి ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేవారమన్నారు. ఇప్పుడు ఈ కేంద్రాల్లో శుక్రవారంతోపాటు మంగళవారం సైతం సదరం కేంద్రాలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. విశాఖపట్నం నగరంలోని నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి కేజీహెచ్‌లో మంగళ, శుక్రవారాలు రెండు రోజులు సదరం కేంద్రాలు అందుబాటులో ఉంటాయన్నారు. జిల్లాలోని అరకు, పాయకరావుపేట, మాడుగుల, ఎలమంచిలి ఆసుపత్రుల్లో, పెందుర్తి ఆరోగ్య కేంద్రాలు మంగళవారం నాడు... పాడేరు, చోడవరం, భీమిలి ఆసుపత్రులతోపాటు గాజువాకకి సంబంధించి అగనంపూడి ఆసుపత్రిలో బుధవారం ఈ శిబిరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. డిసెంబరు 3 నుంచి జిల్లాలోని 15 నియోజకవర్గాలకు సంబంధించిన ఆసుపత్రుల్లో సదరం కేంద్రాలను నిర్వహిస్తామన్నారు.