హైదరాబాద్(ఆరోగ్యజ్యోతి): రాష్ట్రంలో వ్యాధుల నివారణకు చేపట్టాల్సిన 'హెల్త్ క్యాలెండర్'కు కేబినెట్ సబ్ కమిటీ ఆమోదం తెలిపింది. మొత్తం 24 అంశాలతో, 71 పేజీల్లో రూపొందించిన ఈ క్యాలెండర్‌ను త్వరలో అమలు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. జనవరి మొదలుకొని డిసెంబర్ వరకూ ఏ నెలలో ఏ వ్యాధులకు అవకాశం ఉంది? దాని లక్షణాలు, ముందస్తు జాగ్రత్తలు వంటి పలు వివరాలతో ఈ క్యాలెండర్‌ను రూపొందించారు. నిర్మాణం జరిగి ఉపయోగంలో లేకుండా ఉన్న 1,500 పడకలను వెంటనే అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. వెయ్యి ఫాగింగ్ మిషన్లతో రాష్ట్రవ్యాప్తంగా దోమల నివారణకు స్ప్రే చేయించాలని సమావేశంలో నిర్ణయించారు. దోమల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు మంత్రి తెలిపారు. ఈటల అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.