విజయవాడ,(ఆరోగ్యజ్యోతి): మైలవరం తెలుగు అసోసియేషన్ ఆఫ్ మేరీల్యాండ్ అధ్యక్షుడు యారమల రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పేదలకు ఉచితంగా కళ్ళ జోళ్ళను సర్కిల్ ఇస్‌స్పెక్టర్ పి.శ్రీనివాసు చేతుల మీదుగా పంపిణీ చేశారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ మేరీల్యాండ్ అధ్యక్షుడుగా ఎన్నికైన రాజశేఖర్ రెడ్డి సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. తన స్వగ్రామమైన వెల్వడంలో గత వారం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయగా శాసన సభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ ప్రారంభించారు. వైద్యులు కంటి సమస్యలు ఉన్నవారిని గుర్తించిన సంగతి తెలిసిందే. సి.ఐ. శ్రీనివాసు చేతుల మీదుగా రాజశేఖర్ రెడ్డి 210 మంది పేదలకు కళ్ళ జోళ్ళను ఈ రోజు అందజేశారు. ఈ సందర్భంగా సి.ఐ. శ్రీనివాసు మాట్లాడుతూ మనిషి అవయవాల్లో నయనం ప్రధానమని దృష్టి లోపం కారణంగా ఎంతో మంది అనునిత్యం ప్రమాదాలకు గురవుతున్నారని అన్నారు. అమెరికాలో స్థిరపడినప్పటికి మాతృభూమిలో సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేయాలని తన వంతు సహకారం ఎప్పుడు ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమానికి రాజశేఖర్ రెడ్డి సోదరుడు యరమల రాంభూపాల్ రెడ్డి తన సహకారాన్ని అందించారు.