గిరిజనులకు మెరుగైన వైద్యసేవలు

 


          ఆదిలాబాద్ఉ,ట్నూరు,(ఆరోగ్యజ్యోతి)


ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని గిరిజనులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తామని రాష్ట్ర మంత్రి ఐకేరెడ్డి అన్నారు. ఉట్నూరు పీఎమ్మార్సీలో బుధవారం జరిగిన ఐటీడీఏ పాలకమండలి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఐకెరెడ్డి మాట్లాడుతూ.. అవసరమైన పీహెచ్‌సీల్లో వైద్యుల నియామకంతోపాటు రక్తహీనతతో బాధపడుతున్న వారికి పౌష్టికాహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.


ఈ సమావేశంలో ఆయనతోపాటు ఆదిలాబాద్‌, పెద్దపల్లి ఎంపీలు సోయం బాపురావు, వెంకటేష్‌ నేత, ఆదిలాబాద్‌, నిర్మల్‌, కుమురం భీం జిల్లాల జడ్పీ ఛైర్మన్లు రాఠోడ్‌ జనార్దన్‌, విజయలక్ష్మి, కోవ లక్ష్మి, ఎమ్మెల్సీలు పురాణం సతీష్‌, జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రేఖానాయక్‌, ఆత్రం సక్కు, కోనేరు కోనప్ప, రాఠోడ్‌ బాపురావు, విఠల్‌రెడ్డి, దుర్గం చిన్నయ్య, దివాకర్‌రావు, జోగురామన్న, నాలుగు జిల్లాల పాలనాధికారులు దివ్య దేవరాజన్‌, ప్రశాంతి, రాజీవ్‌గాంధీ హన్మంతు, భారతి హోళ్లికేరి, ఐటీడీఏ పీఓ కృష్ణ ఆదిత్య హాజరయ్యారు.


పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకుంటున్నాం.


- ఆదిలాబాద్‌ జిల్లా పాలనాధికారి దివ్య


రక్తహీనతతో బాధపడుతున్న ఆదిమ గిరిజనులకు పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇతర గిరిజనులకు కూడా వర్తింపజేయడానికి కృషి చేస్తాం. కోలాంలలో ప్రతి ప్రసవానికి ఉచితంగా కేసీఆర్‌ కిట్టును అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పీహెచ్‌సీలలో వైద్యసిబ్బంది సమస్యలను పరిష్కరిస్తాం.


వైద్యులను నియమించండి


- రాఠోడ్‌ జనార్దన్‌, జడ్పీ ఛైర్మన్‌


నార్నూరులో పెద్ద ఆసుపత్రి ఒకే ఒక డాక్టరు ఉన్నారు. కొత్తగా ఆసుపత్రి భవన నిర్మాణం పూర్తయింది. ఇంకా ప్రారంభించలేదు. ఎక్కువ గిరిజనులు, గిరిజనేతరుల జనాభా కలిగిన నార్నూరు మండలంలో పూర్తిస్థాయిలో వైద్యులు, సిబ్బంది నియమించాలి. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేలా చర్యలు తీసుకోండి.


బ్లడ్‌బ్యాంకును ఏర్పాటుచేయండి


- జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీ


గిరిజన సమస్యలను నిర్లక్ష్యం చేయడం తగదు. ఉట్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన బ్లడ్‌బ్యాంకును వెంటనే ప్రారంభించాలి. రక్తహీనత సమస్యను అధిగమించేందుకు వారికి పౌష్టికాహారం అందించండి. 'మిషన్‌ భగీరథ' పనులు నెలల తరబడి సాగుతున్నాయి. నిర్దిష్టమైన గడువును విధించి ఇంటింటా తాగునీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోండి.


పౌష్టికాహార కిట్లను పంపిణీ చేయించండి


- కోనేరు కోనప్ప, సిర్పూర్‌(టి) ఎమ్మెల్యే


బెజ్జూరు, సిర్పూర్‌(టి) ప్రాంతాలలోని మారుమూల గ్రామాలలో గిరిజన మహిళలు, గర్భిణులు, బాలింతలు రక్తహీనత సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. వారికోసం పౌష్టికాహార కిట్లను పంపిణీ చేయించి ఆదుకోండి. గ్రామాలలో వైద్యసేవలు అందించేలా చర్యలు తీసుకోండి. ఆ ప్రాంతాలకు చెందిన మల్లరి రైతుల సమస్యలను పరిష్కరించాలి.


డయాలసిస్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి


- పురాణం సతీష్‌, ఎమ్మెల్సీ


కుమురం భీం జిల్లా కేంద్రమైన ఆసిఫాబాద్‌లోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో డయాలసిస్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. లొద్దిగూడలో ఇంటికొకరు మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారు. ఈ సమస్య తీరాలంటే వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకోండి.


ఉట్నూరు ఆసుపత్రి సమస్యలను తీర్చండి


- అజ్మీరా రేఖానాయక్‌, ఎమ్మెల్యే ఖానాపూర్‌


నిర్లక్ష్యానికి గురైన ఉట్నూరు ఆసుపత్రిని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభివృద్ధి చేశారు. 50 పడకలకు ఉన్నతీకరించారు. ఇప్పుడు ఆసుపత్రిలో చిన్నపిల్లల వైద్యనిపుణుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రోగులు ఎక్కువగా వస్తున్నారు. సరిపడా సిబ్బంది లేరు. ప్రత్యేక వైద్యనిపుణులను నియమించి ఆసుపత్రి సమస్యను పరిష్కరించాలి.