తల్లీపిల్లల వైద్యశాలలో పరికరం దగ్ధం

డాక్టర్‌ అప్రమత్తతతో తప్పిన ప్రమాదం


తెనాలి(కొత్తపేట),(ఆరోగ్యజ్యోతి): జిల్లా ఆసుపత్రిలోని తల్లీపిల్లల సంరక్షణ కేంద్రంలో శుక్రవారం సిబ్బంది నిర్లక్ష్యంతో విద్యుత్తు ఆటోక్లేవ్‌(దుస్తులు, సామగ్రి స్టెరిలైజేషన్‌ చేసేది) దగ్ధమైంది. దీనిని వైద్యురాలు గమనించి చెప్పడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కేంద్రం సిబ్బంది సాయంత్రం ఆటోక్లేవ్‌ స్విచ్‌ ఆన్‌ చేసి, తరువాత దానిని ఆపడం విస్మరించారు. దీంతో అది కాలిపోయి ఆసుపత్రి అంతటా దట్టమైన పొగలు అలముకున్నాయి. ఇవి మొదటి అంతస్తు నుంచి కింద ఉన్న గ్రౌండ్‌ఫ్లోర్‌లోకి కూడా వ్యాపించాయి. వీటిని అక్కడ ఉన్న ప్రసూతిసేవల విభాగాధిపతి డాక్టర్‌ ఎం.సనత్‌కుమారి చూసి సిబ్బందిని అప్రమత్తం చేశారు. పొగలు ఎక్కడి నుంచి వస్తున్నాయో చూడాలని సిబ్బందిని ఆదేశించారు. వీరు వెంటనే అక్కడకు వెళ్లి ఆటోక్లేవ్‌ స్విచ్‌ ఆఫ్‌ చేశారు. అప్పటికే తల్లీపిల్లల సంరక్షణ కేంద్రం అంతా పొగలతో నిండి పోయి భరించలేని కమురు వాసన వ్యాపించింది. దీనిని తట్టుకోలేని రోగుల సహాయకులు రోగులను పడకల మీద వదిలి వైద్యశాల బయటకు వెళ్లారు. ఆ డాక్టరమ్మ వెంటనే సిబ్బందిని  అప్రమత్తం చేయకుండా ఉండి ఉంటే పెద్ద ప్రమాదం జరిగేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. జరిగిన సంఘటన గురించి సిబ్బంది ఆర్‌ఎంవో శ్రీనివాసరావుకు ఫోన్‌లో తెలపగా వచ్చి పరిశీలించారు. ఆయన ఆసుపత్రి పర్యవేక్షకులు కె.ఈశ్వరప్రసాద్‌కు ఫోన్‌లో పరిస్థితిని వివరించారు. ఎస్‌ఎన్‌సీయూలో సుమారు రెండు నెలల క్రితం స్టెబిలైజర్‌లో లోపం వల్ల మంటలు వ్యాపించాయి. ఇప్పుడు ఆటోక్లేవ్‌ కాలిపోవడం గమనార్హం.