ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్యం


 




తూప్రాన్ (ఆరోగ్యజ్యోతి):   కార్పొరేట్‌స్థాయి తరహలో ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని, ఈ అవకాశాన్ని నిరుపేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జెడ్పీ చైర్ పర్సన్ హేమలత అన్నారు. ప్రైవేట్ దవాఖానలకు వెళ్లడం ద్వారా రూ.వేళల్లో ఖర్చులు చేసుకోవడం జరుగుతుందన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రభు త్వ దవాఖానల్లో ఉచితంగా మెరుగైన వైద్య సేవలు అందిస్తుందన్నారు. వైరల్‌ఫీవర్‌తో బాధపడుతున్న ఆమె మంగళవారం తూప్రాన్‌లోని 50 పడకల ప్రభుత్వ దవాఖానలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. డాక్టర్‌లు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందించడంపై ఆమె సంతృప్తి వ్యక్తం చేసి వైద్య సిబ్బందిని అభినందించారు. దవాఖానలో రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి ఆమె ఆరా తీశారు. ఈ సందర్భంగా దవాఖాన సూపరింటెండెంట్ అమర్‌సింగ్, పీహెచ్‌సీ డాక్టర్ ఆనంద్, ఇతర వైద్య సిబ్బందితో కలిసి ఆమె మాట్లాడారు. ప్రభుత్వ దవాఖానలపై ప్రజలకు పూర్తిస్థాయిలో నమ్మకం కలిగించేలా వైద్యసిబ్బంది సేవలు అందించాలన్నారు. రోజురోజుకూ తూప్రాన్ ప్రభుత్వ దవాఖానకు వచ్చే రోగుల సంఖ్య పెరుగుతుండటాన్ని గమనించి ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలకు మంచి మెరుగైన వైద్య సేవలు అందించడంతోనే దవాఖానకు వచ్చే రోగుల సంఖ్య పెరుగుతుందన్నారు. తూప్రాన్ 50 పడకల దవాఖానపై నమ్మకం ఉంచి పట్టణ, పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. తనకు అందించిన వైద్య సేవల తరహలోనే ప్రజలకు అందించాల్సిన బాధ్యత వైద్యసిబ్బందిపై ఎంతైనా ఉందన్నారు. దవాఖానలో వైద్యులు నిర్లక్ష్యం చేస్తే తనదృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా ఆమె ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ జిల్లా నాయకుడు ర్యాకలశేఖర్‌గౌడ్‌తో పాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.