నిజామాబాద్(ఆరోగ్యజ్యోతి): నగర ప్రజలకు ఆరోగ్యంతో పాటు పారిశుద్ధ్యం పై వారం రోజుల పాటు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం రామ్మోహనరావు తెలిపారు. ఖిల్లా వద్ద ప్రత్యేక పారిశుద్ధ్య, ఆరోగ్య కార్యక్రమాలకు సంబంధించి అవగాహన ర్యాలీని జెండా ఊపి కలెక్టర్ ప్రారంభించారు. ఖిల్లా వీధులలో పర్యటించి పరిసరాలను పరిశీలించారు. ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడి ప్లాస్టిక్ వాడవద్దనీ, చెత్తను ఇంటి ముందుకు వచ్చే మున్సిపాలిటీ వారికి అందచేయాలని కోరుతూ, వారికి జనపనార సంచులను పంపిణీ చేశారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నెల రోజుల క్రితం పల్లెల్లో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పారిశుద్ధ్య కార్యక్రమాలపై అవగాహన కల్పించామన్నారు. అదే స్ఫూర్తితో పట్టణాల్లో కూడా పారిశుద్ధ్య ఆరోగ్య కార్యక్రమాల ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడానికి ఈ అవగాహన కార్యక్రమాలను వారం రోజుల పాటు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. తద్వారా పట్టణ ప్రజలకు ఆరోగ్యం, పారిశుద్ధ్య కార్యక్రమాలపై తీసుకోవాల్సిన చర్యలతోపాటు పలు దుష్పరిణామాలకు కారణమవుతున్న ప్లాస్టిక్ ను తగ్గించడానికి 50 మైక్రాన్ల లోపు ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించడానికి, ప్లాస్టిక్ వ్యర్ధాలను రీసైకిలింగ్ తో తిరిగి ఉపయోగించడానికి, నిజామాబాద్ ను ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దడానికి, ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు.. ఈ సందర్భంగా పారిశుద్ధ్య అవగాహనకు సంబంధించిన తెలుగు ఉర్దూ కరపత్రాలను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ కమిషనర్ జాంసాన్ , జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుదర్శన్ మున్సిపాలిటీ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.