ఆయుర్వేదంతో ఆయుష్షు వృద్ధి

ప్రాణాయామంతో సత్ఫలితం: జేసీ


సిద్దిపేట, (ఆరోగ్యజ్యోతి): ఆయుర్వేదంతో ఆయుష్షును వృద్ధి చేసుకోవచ్చని ఇన్‌ఛార్జి జేసీ చంద్రశేఖర్‌ తెలిపారు. విశ్వ ఆయుర్వేద పరిషత్‌, ఆయుష్‌ విభాగం రూపొందించిన బ్రహ్మీ ముహూర్తం గొప్పదనం తెలియజేసే కరపత్రాన్ని సిద్దిపేటలో సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్‌ మాట్లాడుతూ.. సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఆరోగ్య పరిరక్షణ క్రియలు చేపట్టాలని సూచించారు. వేకువజామున గాలిలో ప్రాణవాయువు శాతం అధికంగా ఉంటుందన్నారు. ఈ కారణంగా రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులు అదుపులో ఉంటాయన్నారు. రోగ నిరోధకశక్తి పెంపొందడం వల్ల అనారోగ్య సమస్యలు దరిచేరవన్నారు. ప్రతి ఒక్కరూ ప్రాణాయామం చేసి ఫలితం పొందాలన్నారు. అంతా ఆనంద, ఆరోగ్యకర జీవితాన్ని గడపాలన్నారు. కార్యక్రమంలో ఆయుర్వేద వైద్యులు పాల్గొన్నారు.