వరంగల్,(ఆరోగ్యజ్యోతి): వరంగల్ సీకేఎం ఆసుపత్రిలో ప్రభుత్వ మందుల ధ్వంసం పేరిట బ్లాక్ మార్కెటింగ్ చేశారని, నిధుల భారీగా దుర్వినియోగంపై విచారణ చేయించాలని శనివారం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ)కి ఫిర్యాదు చేసినట్లు వినియోగదారుల మండలి అధ్యక్షుడు సాంబరాజు చక్రపాణి ఒక ప్రకటనలో తెలిపారు. గడువు తీరిన మందుల ధ్వంసానికి సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ ఛైర్మన్‌గా వేసిన కమిటీ మందులను ధ్వంసం చేసినట్లు తెలిపిందని, ఆ మందులను ధ్వంసం చేసినప్పుడు కమిటీలో ఉన్న డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్, పొల్యూషన్ బోర్డు అధికారులకు తెలిపి చేశారా.. తెలపకుండా చేశారనే విషయం అడిగితే చెప్పడం లేదని, దీనిపై అనుమానాలు కలుగుతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేంద్రం నుంచి జేఎస్‌ఎస్‌కే, జేఎస్‌వై పథకాల కింద ఆసుపత్రికి వస్తున్న నిధులుండగా, ప్రతిరోజు ఆస్పత్రికి వైద్య పరీక్షల కోసం వస్తున్న గర్భిణుల నుంచి రక్త, మూత్ర, స్కానింగ్ పరీక్షలకు ఛార్జీలు వసూలు చేస్తున్నారని, అలాంటప్పుడు కేంద్రం నుంచి వస్తున్న నిధులు ఏం చేస్తున్నారో లెక్కలు చూపడం లేదని, దీనిపై విచారణ జరిపించాలని ఫిర్యాదులో కోరినట్లు తెలిపారు. ఎన్‌హెచ్‌ఎం ద్వారా నియామకమైన వైద్యులను కొనసాగించే విషయంలో సూపరింటెండెంట్ నిబంధనలు పాటించడంలేదని, కొందరు వైద్యులు విధులకు హాజరుకాకపోయినా ప్రతి నెలా వేతనాలు అందిస్తున్నారనీ తెలిపారు. సీకేఎం ఆస్పత్రి ఏవో అశోక్‌కుమార్ అకస్మికంగా సెలవుపై వెళ్లడంతో అర్హత, అనుభవంలేని వారు నగదు, బడ్జెట్, బ్యాంకు వ్యవహారాలు నిర్వహించడం, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ పేరిట అనుచిత నిర్ణయాలు, అక్రమ నియామకాలు తదితర సమస్యల వల్ల గర్భిణులకు సరైన వైద్యసేవలు అందకపోగా, హానికరమైన వాతావరణం ఆస్పత్రిలో నెలకొంటోందని, వెంటనే విచారణ జరిపించాలని ఫిర్యాదులో పేర్కొన్నట్లు చక్రపాణి తెలిపారు