ప్రైవేటు ఆసుపత్రుల్లో దోపిడీ ఆపాలి: డీఎంహెచ్‌వో
నిబంధనలు ఉల్లంఘించిన ఆసుపత్రి అనుమతులు రద్దు
ఆసుపత్రి ఎక్స్‌రేగది సీజ్ చేస్తున్న డీఎంహెచ్‌వో కొండల్‌రావు
నల్గొండ (ఆరోగ్యజ్యోతి ): జిల్లాలో ప్రైవేటు ఆసుపత్రులు దోపిడీలు ఆపాలని జిలా వైద్యఆరోగ్యశాఖ అధికారి డా.అన్నిమల్ల కొండల్‌రావు హెచ్చరించారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని దేవరకొండ రోడ్డులో ఉన్న సంజీవినీ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ మహిళ శుక్రవారం మృతి చెందడంతో వచ్చిన ఫిర్యాదుపై ఆయన స్పందించారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్యం తీరును శనివారం పరిశీలించారు. ఆసుపత్రిలో సెల్లార్ విభాగం, ఎక్స్‌రే గదిలో సైతం రోగులకు మంచాలు వేసి చికిత్స చేయడం, ఇరుకు గదుల్లో ఉన్న మంచాలపై ఇద్దరేసి రోగులకు వైద్యం చేయడం చూసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రికి కేవలం పది పడకల అనుమతి మాత్రమే ఉన్నప్పటికీ 23 పడకలు వేసి వైద్యం చేయడాన్ని తప్పుపట్టారు. ఒకే వైద్యుడు పనిచేస్తున్నట్లు అనుమతి తీసుకుని నలుగురు వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు బోర్డులు ఏర్పాటు చేయడం విచారకరమన్నారు. సాధారణ జ్వరాలను సైతం డెంగీగా చెప్పడం సరైంది కాదన్నారు. ఎక్స్‌రే గదిని సీజ్ చేశారు. ఆసుపత్రి, ఎక్స్‌రే విభాగం అనుమతులతో పాటు వైద్యుడికి ఇచ్చిన అనుమతి రద్దు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం పక్కనే ఉన్న అరుణ ఆసుపత్రిని సందర్శించి అక్కడ ఉన్న లోపాలను సరిచేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాస్ మీడియా అధికారి బిరుదోజి వెంకన్న, డీఎంవో దుర్గయ్య, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.