డెంగీపై సమరం

 


-పీహెచ్‌సీల్లో డెంగీ విభాగం
-గ్రామాల్లో పారిశుధ్య చర్యలు
-మురుగు కాల్వల్లో ఫాగింగ్, బ్లీచింగ్
-గ్రామాల్లో మెడికల్ క్యాంపులు
-దోమలపై వైద్యశాఖ అప్రమత్తం
నాగర్‌కర్నూల్(ఆరోగ్యజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను భయాందోళనకు గురి చేస్తోన్న డెంగీపై జిల్లాలో అధికారులు చర్యలు చేపట్టారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో దాదాపుగా 80మంది వరకు ప్రజలు డెంగీకి గురయ్యారు. ఇటీవల కూడా జిల్లా కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ప్రజలకు డెంగీ రావడంతో ప్రభుత్వ ఆదేశంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ శ్రీధర్ సూచనతో జిల్లాలో వైద్యఆరోగ్య, పంచాయతీ, పురపాలక శాఖలు సంయుక్తంగా డెంగీ నిర్మూలన చర్యలకు శ్రీకారం చుట్టాయి. ఇందులో భాగంగా ముందుగా గ్రామాలు, పురపాలికల్లో మురుగు కాల్వలను శుభ్రం చేయడంతో పాటుగా బ్లీచింగ్ పౌడర్ చల్లడం చేపట్టారు. ముఖ్యంగా పట్టణాల్లో దోమల నిర్మూలించే ఫాగింగ్ జరిపారు. దీనివల్ల దోమల నిర్మూలనలో ఒక అడుగు ముందుకు పడింది. ఇప్పటికే ప్రభుత్వం పల్లె ప్రగతితో గత నెల రోజులుగా గ్రామాల్లో పారిశుధ్య చర్యలు తీసుకొంది. దీనివల్ల మురుగు గుంతలు, మురుగు కాల్వలు శుభ్రమయ్యాయి. పిచ్చి మొక్కలు తొలగించడం జరిగింది. ఇక వైద్యఆరోగ్య శాఖ సైతం ప్రజలకు డెంగీపై అవగాహన కల్పించే చర్యలను అమలు చేస్తోంది. జిల్లాలోని 25పీహెచ్‌సీల్లో డెంగీ కార్నర్‌లను ఏర్పాటు చేసింది. ఇందులో దోమల వృద్ధి ఏ విధంగా జరుగుతుందోననే అంశాలతో కూడిన వస్తువులను ప్రదర్శనగా ఉంచారు. ఖాళీ టైర్లు, నీళ్ల డబ్బాలు, కొబ్బరి బొండాలు, టీ, నీళ్ల గ్లాసులను ఉంచారు. అక్కడికి వచ్చే ప్రజలకు దోమలు పెరుగుదలకు కారణాలపై వైద్య సిబ్బంది ద్వారా వివరిస్తున్నారు. ఇదే గాక గ్రామాల్లో వైద్య శిబిరాలు సైతం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో 80వరకు గ్రామాల్లో శిబిరాలు చేపట్టడం జరిగింది.

ఇందులో ప్రజలకు డెంగీ వ్యాధి వచ్చే విధానం, తీసుకోవాల్సిన చికిత్స, నివారణ, నిర్మూలన గురించి తెలియజేస్తున్నారు. డెంగీ వ్యాధి కేసులు నమోదైన ఇండ్ల వద్దకు చేరుకొని కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు. కొన్ని రోజులు ఆ కుటుంబీకులతో పాటుగా పరిసర ప్రాంతాల్లోని ప్రజల పట్ల కూడా ప్రత్యక శ్రద్ధ వహిస్తున్నారు. డెంగీ వ్యాధిగ్రస్థుల సమీప నివాసాల్లో కాల్వల శుభ్రం చేయడంతో పాటుగా పట్టణాల్లో అయితే ఫాగింగ్ చేయిస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది జనవరి నుంచి 80వరకు డెంగీ కేసులు నమోదవ్వగా అధిక శాతం పరిసరాల పరిశుభ్రత లోపించి దోమలు వృద్ధి చెందడంతోనే రావడం గమనార్హం. డెంగీ వ్యాధిగ్రస్థులకు జిల్లా కేంద్రంలోని ఆస్పత్రిలో ప్లేట్ లెట్ కౌంటింగ్ పరీక్షలు చేపడుతున్నారు.

వ్యాధి నిర్ధారణ అయ్యాక సాధారణ జ్వరాల మాదిరిగా పీహెచ్‌సీల్లో వైద్యులు చికిత్సలు అందిస్తున్నారు. అయితే చిన్న జ్వరం వచ్చినా డెంగీగా అనుమానించిన ప్రజలు పట్టణ కేంద్రాల్లోకి ఆర్‌ఎంపీలతో పాటుగా ప్రైవేట్ ఆస్పత్రులకు చేరుకొంటున్నారు. ఇక్కడ సాధారణ ప్లేట్‌లెట్ పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యులు ప్లేట్‌లెట్ కౌంటింగ్ తగ్గిందనే భయాందోళనకు గురి చేసి ప్రజలను సొమ్ము చేసుకొంటున్నారు. సాధారణ జ్వరాలకు కూడా ప్లేట్‌లెట్లు తగ్గుతాయని తెలియక ఆర్థికంగా నష్టపోతున్నారు. దీనిపై మెడికల్ క్యాంపుల్లో వైద్య శాఖ విస్తృత అవగాహన చేపట్టింది. దీంతో ఇప్పుడిప్పుడే ప్రజలకు డెంగీపై అవగాహన పెరుగుతోంది. దీంతో పరిసరాల పరిశుభ్రతతో పాటుగా దోమల నివారణ చర్యలు తీసుకొంటున్నారు. మొత్తం మీద అధికార యంత్రాంగం చేపట్టిన చర్యలు ప్రజలకు డెంగీపై భయాన్ని తొలగించి భరోసాను కల్పిస్తున్నాయి.