వివరాలు తెలుసుకుంటున్న నీతి ఆయోగ్ బృంద సభ్యులు
పాల్వంచ (ఆరోగ్యజ్యోతి): ఆసుపత్రిలో సౌకర్యాలు భేష్‌గా ఉన్నాయి. వీటికి మానవ వనరులు తోడైతే సేవల్లో మరింత వేగం పెరుగుతుందని నీతి ఆయోగ్ బృంద సభ్యులు కస్తూరి, మోహన్‌రావు అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా పాల్వంచ సామాజిక ఆసుపత్రిని మంగళవారం పరిశీలించారు. ముందుగా ఆసుపత్రి చీఫ్ సూపరింటెండెంట్ డా.ముక్కంటేశ్వరరావును మర్యాద పూర్వకంగా కలిశారు. ఆసుపత్రి ఆవరణను కలియ తిరుగుతూ ప్రతి వార్డును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా 81 ప్రశ్నలతో కూడిన సర్వేను నిర్వహించారు. సౌకర్యాలు, వసతులపై పలు రకాల ప్రశ్నలను సంధించారు. ఆపరేషన్ థియేటరు, ప్రసూతి వార్డు, వ్యాక్సినేషన్ గది, గర్భిణుల కొరకు అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉందా? పనిచేస్తుందా? హెచ్‌ఐవీ ఎయిడ్స్, కౌన్సెలింగ్ గదులు, రక్త పరీక్షల నిర్వాహణపై వివరాలు సేకరించారు. నెలకు జరుగుతున్న కాన్పులు? సమీపంలోని పీహెచ్‌సీల నుంచి రిఫర్ అవుతున్న కేసులపై వివరాలను సేకరించారు. రోగులకు నాణ్యమైన సేవలు అందాలంటే ఏం కావాలి? అని నీతి ఆయోగ్ బృందం సూపరింటెండెంట్‌ను ప్రశ్నించారు. ఆయన స్పందిస్తూ.. అత్యవసరంగా అంబులెన్సు, వైద్యులు, సిబ్బంది అవసరమని బదులిచ్చారు.