రూ.5 కోట్లు నష్ట పరిహారం కోరిన బాధితుడు
తిరుపతి(ఆరోగ్యజ్యోతి): మోకీళు శస్త్ర చికిత్స కోసం వచ్చిన రోగికి వైద్యులు నిర్లక్ష్యంగా మరో రక్తం ఎక్కించడం.. ప్రాణంపైకి వచ్చింది. బాధితుడి కథనం మేరకు.. కృష్ణా జిల్లా గంపాలగూడెం మండలం మేదరు సత్యాలపాడు గ్రామానికి చెందిన కంచం రామయ్య(69) మోకీళు మార్పిడి కోసం తిరుపతి బర్డ్ ఆస్పత్రికి ఈ ఏడాది జూన్ 6వ తేదీ వచ్చారు. ముందస్తు రిజిస్ట్రేషన్ మేరకు అదే నెల 12వ తేదీ మోకాలికి శస్త్ర చికిత్స నిర్వహించారు. ఆ సమయంలో రోగికి రక్తం అవసరం రావడంతో స్విమ్స్ రక్తనిధి నుంచి సేకరించి ఎక్కించారు. రోగి కోమాలోకి వెళ్లడంతో బంధువులు వైద్యులతో వాగ్వాదానికి దిగడంతో స్విమ్స్‌కు తరలించారు. అక్కడి వైద్యులు రక్త పరీక్ష నిర్వహించి రెండు రకాల రక్త నమూనాలు ఉన్నట్లు గుర్తించారు. అప్పటికే మూత్రపిండాలు దెబ్బతినడంతో వెంటనే వార్డులోకి మార్చి 18 రోజులు వైద్య సేవలందించారు. ఆరోగ్యం కొద్దిగా కుదుటపడటంతో జులై 4వ తేదీ డిశ్చార్జ్ చేసినట్లు బాధితుడు రామయ్య 'న్యూస్‌టుడే'కు చరవాణి ద్వారా తెలిపారు. ఓ పాజిటివ్ రక్తం కాకుండా బి పాజిటివ్ రక్తం ఎక్కించినట్లు బాధితుడు ఆరోపిస్తున్నారు. రక్తం మార్పు వల్ల కిడ్నీ సమస్య తలెత్తిందని.. శరీరంపై దురద ఏర్పడిందన్నారు. తనకు నష్ట పరిహారంగా రూ.ఐదు కోట్లు బర్డ్ ఆస్పత్రి ఇవ్వాలని లేఖ పంపినట్లు చెప్పారు.
* ఈ విషయమై బర్డ్ ఆస్పత్రి ఆర్‌ఎంఓ డాక్టర్ వెంకారెడ్డిని వివరణ కోరగా.. మా ఆస్పత్రి తప్పులేదని, రక్తం మార్చి పంపిన స్విమ్స్ వారే బాధ్యులన్నారు. ఈ విషయంగా స్విమ్స్ ఆస్పత్రి వర్గాలను సంప్రదించగా.. విచారణ జరుగుతోందని.. ఇప్పుడే ఏమీ చెప్పలేమన్నారు