ఒక్కొక్కరికి ఒక్కో బుక్.. ఆన్‌లైన్‌లో వివరాల నమోదు
ప్రస్తుతం ఏఎన్‌ఎంలకు కొనసాగుతున్న శిక్షణ
రాష్ర్టంలో 12 జిల్లాల్లో 5.14 లక్షల మంది పేషెంట్ల గుర్తింపు
(ఆరోగ్యజ్యోతి)
బీపీ, షుగర్ పేషెంట్లకు యూనిక్ ఐడీలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి వ్యక్తికి ప్రత్యేక ఐడీతో కూడిన బుక్ అందజేయనుంది. ఈ బుక్‌లో యూనిక్ ఐడీ, పీహెచ్‌సీ కోడ్, డిస్ర్టిక్ట్ కోడ్, విలేజ్ కోడ్ ఉంటాయి. ఇప్పటికే బుక్స్ సిద్ధంగా ఉన్నాయని, త్వరలోనే పంపిణీ చేస్తామని ఓ ఉన్నతాధికారి చెప్పారు. బుక్‌ల వినియోగంపై ప్రస్తుతం ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలకు శిక్షణ ఇస్తున్నారు. ఒక్కో పేషెంట్‌కు ఒక్కో బుక్‌ను ఇచ్చి, అందులోని యూనిక్ కోడ్‌ను పేషెంట్ వివరాలకు అనుసంధానించి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. ప్రతి నెల రోగికి అందిస్తున్న ట్రీట్‌మెంట్ ప్రొసీజర్, ఉచితంగా పంపిణీ చేస్తున్న మందులు, ఇతర విషయాలు ఈ బుక్‌లో, ఆన్‌లైన్‌లో ఎంటర్ చేస్తారు.
12 జిల్లాల్లో సర్వే పూర్తి
రాష్ర్టంలో సిద్దిపేట, జనగామ, కరీంనగర్, మహబూబాబాద్, సిరిసిల్ల, భూపాలపల్లి, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, మెదక్, సంగారెడ్డి, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో ఎన్‌సీడీ సర్వే పూర్తయింది. ఈ జిల్లాల్లో 30 ఏండ్లు పైబడిన 35 లక్షల మందికి బీపీ, షుగర్ పరీక్షలు చేయించారు. ఇందులో 2.14 లక్షల మందికి డయాబెటిస్, సుమారు 3 లక్షల మందికి హైపర్ టెన్షన్ ఉన్నట్టు గుర్తించారు. తమకు షుగర్, బీపీ ఉందని వీరిలో సుమారు 50% మందికి సర్వేలో గుర్తించే వరకు తెలియకపోవడం గమనార్హం. మిగిలిన 21 జిల్లాల్లో సర్వే కొనసాగుతోంది. ఈ జిల్లాల్లోనూ లక్షల మందికి హైపర్ టెన్షన్, డయాబెటిస్ ఉన్నట్టు హెల్త్ ఆఫీసర్లు చెబుతున్నారు. క్షేత్రస్థాయి ఆరోగ్య కార్యకర్తలు గుర్తించిన సస్పెక్టెడ్ కేసులకు పీహెచ్‌సీ స్థాయిలో మరోసారి పరీక్షలు చేయాల్సి ఉంది. ఇక సర్వే పూర్తయిన 12 జిల్లాల్లో మరోసారి సర్వే చేయనున్నట్టు ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. తొలి దశలో కొన్ని చోట్ల పాత పేషెంట్ల వివరాలు నమోదు చేయలేదు. వీళ్లతోపాటు, తొలి దశ సర్వేలో మిస్ అయిన వ్యక్తులను, హైపర్‌టెన్షన్, డయాబెటిస్ ఉన్నట్టు తేలిన వ్యక్తులను రెండో దశ సర్వేలో పరీక్షించనున్నారు.
లక్షలాది కేసులు
దేశంలో పల్లె, పట్నం తేడా లేకుండా బీపీ, షుగర్ బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. ఆహారపు అలవాట్లు, ఇతర కారణాలతో మూడు పదుల వయసులోనే చాలా మంది డయాబెటిస్ బారిన పడుతున్నారు. తమకు బీపీ, షుగర్ ఉన్నట్టు చాలా మందికి రోగం ముదిరే వరకు తెలియడం లేదు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్‌పై సర్వే చేయిస్తోంది. ఇందులో లక్షల మందికి హైపర్ టెన్షన్, డయాబెటిస్ ఉన్నట్లు తెలుస్తోంది.