కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్ ,వెంగళ్‌రావునగర్,(ఆరోగ్యజ్యోతి): ఆయుర్వేద వైద్యం ప్రాధాన్యంŸ, ప్రాముఖ్యతను నవ తరానికి తెలియజేయాల్సిన అవసరముందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలలో ఆరోగ్య దేవుడుగా గుర్తింపు పొందిన భగవాన్ శ్రీ ధన్వంతరి జయంతిని పురష్కరించుకొని జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని శుక్రవారం ఎర్రగడ్డలోని డాక్టర్ బి.ఆర్.కె.ఆర్. ప్రభుత్వ ఆయుర్వేద వైద్యకళాశాలలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ..ఆయుర్వేదానికి జన్మనిచ్చిన దేశం, జ్ఞానం ఇచ్చిన దేశం భారతదేశమన్నారు. భగవాన్ ధన్వంతరి జయంతిని జాతీయ ఆయుర్వేద దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారికి ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా ఇంటి పెద్దనే వైద్యుడుగా ఉండటమే కాకుండా అందుబాటులో లభించే ఆకులు, మూలికలే ఔషధంగా పనిచేసేవని తెలిపారు. వృద్ధుల్లో వచ్చే ఇబ్బందులు ఆయుర్వేదం ద్వారా అవగాహన, చికిత్స, నివారణ గూర్చి ప్రిన్సిపల్ డాక్టర్ రవీందర్ రచించిన పుస్తకాన్ని మంత్రి కిషన్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో తొలిత మంత్రి మొక్కలు నాటి నీళ్లుపోశారు. కార్యక్రమంలో భాజపా నగర కమిటీ ప్రధాన కార్యదర్శి అట్లూరి రామకృష్ణ, కళాశాల విశ్రాంత ఆచార్యులు డా.రామశాస్త్రి, డా.సురేందర్‌రెడ్డి, డా.విద్యానాథ్, ఆరోగ్య భారతి కేంద్ర సభ్యులు రామరాజు, సురక్ష ఆయుర్వేద సభ్యులు డాక్టర్ రాజరాజేశ్వరి, కళాశాల, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.