కాలానుగుణ వ్యాధులపై అప్రమత్తంగా ఉందాం

కార్పొరేషన్‌, జిల్లా ఆరోగ్యశాఖ అధికారులతో డీఎంహెచ్‌వో సమీక్ష


వరంగల్,(ఆరోగ్యజ్యోతి): భారీ వర్షాలు, పెరుగుతున్న దోమలు, వాటికి తగ్గట్టుగా వస్తున్న కాలానుగుణ వ్యాధుల నివారణకు కార్పొరేషన్‌, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ హరీష్‌రాజ్‌ అన్నారు.  జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో కార్పొరేషన్‌ ఆరోగ్య అధికారి డాక్టర్‌ రాజారెడ్డి, వైద్యఆరోగ్యశాఖ కార్యక్రమ అధికారులతో డీఎంహెచ్‌వో డాక్టర్‌ హరీష్‌రాజ్‌ కాలానుగుణ వ్యాధులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. నగరంలో సమస్యాత్మక ప్రాంతాల్లో ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలన్నారు. నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో యాంటి లార్వాలో దోమల మందు పిచికారి, ఫాగింగ్‌, నీటిగుంటల్లో ఆయిల్‌బాల్స్‌ వేయాలని, జ్వరపీడితుల నుంచి రక్తపూతలు సేకరించి వ్యాధి నిర్ధారణ కోసం ఎంజీఎం ఆసుపత్రికి పంపించాలని సూచించారు. ఈ సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ యాకూబ్‌పాషా, మలేరియా అధికారి డాక్టర్‌ వాణిశ్రీ, ఎపిడమిక్‌ అధికారి డాక్టర్‌ కృష్ణారావు, అదనపు డీఎంహెచ్‌వో డాక్టర్‌ మదన్‌మోహన్‌, డీఐవో డాక్టర్‌ గీతాలక్ష్మి, ఎన్‌సీడీ అధికారి డాక్టర్‌ ఉమశ్రీ, ఇన్‌ఛార్జ్‌ ఎస్‌వో మాధవరెడ్డి, రమేశ్‌, లింగమూర్తి, త్రివేణి, సందీప్‌ తదితరులు పాల్గొన్నారు.