- పారిశుధ్య లోపంతో దోమల వ్యాప్తి
- ప్రైవేటు ఆసుపత్రులలో అడ్డగోలు దోపిడీ
మంచిర్యాల(ఆరోగ్యజ్యోతి): మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా జ్వరాలు విజృంభిస్తున్నాయి. చిన్నాపెద్ద తేడా లేకుండా జ్వరాల బారిన పడి ఆసుపత్రుల్లో చేరుతున్నారు. వాతావరణ మార్పులు, కురుస్తున్న వర్షాలతో దోమలు వ్యాప్తి చెంది విష జ్వరాలతో పాటు డెంగీ బారిన పడుతున్నారు. ప్రభుత్వాసుపత్రి, జిల్లాకేంద్రంలోని ప్రైవేటు ఆసుపత్రులు జ్వర పీడితులతో కిటకిటలాడుతున్నాయి. మంచిర్యాలలోని ప్రభుత్వాసుపత్రి, డెంగ్యూ, టైఫాయిడ్, వైరల్ ఫీవర్‌లతో సరైన వైద్యం అందక చిన్నారులు సతమతమవుతున్నారు. ప్రభుత్వాసుపత్రిలో అసౌకర్యాలతో గత్యంతరం లేక ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా నిర్వాహకులు అందినకాడికి దోచుకుంటున్నారు. ప్రభుత్వాసుపత్రిలో మందులు అందుబాటులో ఉన్నా వైద్యం అందించకుండా నిర్లక్ష్యం చే స్తున్నారని రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు. సరిపడా పడకలు, గదులు, ఫ్యాన్‌లు లేక ఒకే బెడ్ పై ఇద్దరు, ముగ్గురు పిల్లలను పడుకోబెట్టి చికిత్స అందిస్తున్నారు. ప్రభుత్వాసుపత్రిలో సరైన చికిత్స అందడం లేదని, రక్తపరీక్షలో డెంగ్యూగా తేలితే వైద్య సౌకర్యాల నిమిత్తం వేరే ఆసుపత్రికి రిఫర్ చేస్తున్నారని చిన్నారుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భయపెడుతున్న జ్వరాలు
చిన్నారులకు విష జ్వరాలు, వైరల్ ఫీవర్‌లతో భయపెడుతున్నాయి. చిన్నారుల ఆరోగ్యంపై అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నామని, సీజనల్ వ్యాధుల నివారణకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామనీ అధికారులు వెల్లడిస్తున్నా వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రిలో డెంగీ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు.