- పీహెచ్‌సీలలో బయోమెట్రిక్ తప్పనిసరి
- డీఎంహెచ్‌వో డాక్టర్ రాజ్యలక్ష్మి
నెల్లూరు (ఆరోగ్యజ్యోతి) : జిల్లా వ్యాప్తంగా జ్వరాలపై విసృత సర్వే చేపట్టాలని డీఎంహెచ్‌వో డాక్టర్ రాజ్యలక్ష్మి ఆదేశించారు. సోమవారం తన కార్యాలయంలో వైద్యాధికారులు, ఆశా నోడల్ అధికారులు, సూపర్‌వైజర్లతో ఆమె సమావేశమయ్యారు. ఆమె మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ఆశా కార్యకర్తలు 50 ఇళ్లు సర్వే చేసి జ్వరాల కేసులుంటే ఆరోగ్య కార్యకర్తలకు తెలపాలన్నారు. ప్రత్యేకించి డెంగ్యూ, మలేరియా జ్వరాలపై ప్రజలకు అవగాహన కల్పించి వారిలో చైతన్యం తీసుకురావాలని సూచించారు. విషజ్వరాల నియంత్రణకు గట్టి చర్యలు తీసుకోవాలని తెలిపారు. నవంబరు 1వ తేదీ నుంచి ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రాలలో బయోమెట్రిక్ హాజరు తప్పని సరిగా పాటించాలని హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో వైద్య సేవలు అందిస్తున్న ఫీల్డ్ సిబ్బంది మినహా ప్రతి ఒక్కరూ బయోమెట్రిక్ విధానం పాటించాలన్నారు. జిల్లా అంధత్వ నివారణ సంస్థ పోగ్రాం అధికారిణి డాక్టర్ మంజులమ్మ మాట్లాడుతూ కంటివెలుగు కార్యక్రమం జిల్లాలో విజయవంతమైందన్నారు. ఈ కార్యక్రమానికి సంబందించి అప్‌లోడింగ్ సరిగా జరగలేదని ఈ నెల 31వ తేదీలోపు పూర్తిచేయాలని తెలిపారు. సబ్‌సెంటర్‌లో పవర్ స్పేర్లు మరమ్మతు చేయించుకోవాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పారిశుధ్య పరిరక్షణ చర్యలు సక్రమంగా చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఐవో డాక్టర్ శెలీనాకుమారి, క్షయనివారణ అధికారి డాక్టర్ వెంకటప్రసాద్, జిల్లా పోగ్రాం అధికారిణి డాక్టర్ ఉమామహేశ్వరి, ఎస్‌వో భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.