జాతీయ వైద్య కమిషన్‌ సెర్చ్‌ కమిటీలో డా.నాగేశ్వరరెడ్డి

 


 హైదరాబాద్‌,(ఆరోగ్యజ్యోతి): జాతీయ వైద్య కమిషన్‌(ఎన్‌ఎంసీ) పరిధిలో కొత్తగా ఏర్పాటు చేయనున్న వేర్వేరు వైద్యమండళ్లలో సభ్యుల నియామకాలపై కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ సెర్చ్‌ కమిటీని నియమించింది. కేంద్ర క్యాబినెట్‌ కార్యదర్శి ఛైర్‌పర్సన్‌గా వ్యవహరించే ఈ కమిటీలో ఆరుగురు సభ్యులుంటారు. వీరిలో తెలంగాణ నుంచి జీర్ణకోశ వ్యాధుల నిపుణులు, ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ ఛైర్మన్‌ డాక్టర్‌ డి.నాగేశ్వరరెడ్డిని ఒక సభ్యుడిగా నియమించారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. టాటా మెమోరియల్‌ సెంటర్‌కు చెందిన క్యాన్సర్‌ వైద్య నిపుణులు డాక్టర్‌ పంకజ్‌ చతుర్వేది, భారతీయ వైద్య పరిశోధన మండలి కార్యదర్శి, ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్‌ బలరామ్‌ భార్గవ, ఉత్తరాఖండ్‌ వైద్యమండలి సభ్యులు డాక్టర్‌ అజయ్‌కుమార్‌ ఖన్నా, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖలో బయో టెక్నాలజీ విభాగ కార్యదర్శి డాక్టర్‌ రేణూ స్వరూప్‌ తదితరులు ఇతర సభ్యులు. ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ కార్యదర్శి సభ్య కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తారు.


దృష్టిపెట్టే అంశాలు
* 1. బోర్డు ఆఫ్‌ ఆయుర్వేద 2. బోర్డు ఆఫ్‌ యునానీ, సిద్ధ 3. మెడికల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ రేటింగ్‌ బోర్డు ఫర్‌ ఇండియన్‌ సిస్టం ఆఫ్‌ మెడిసిన్‌ 4. బోర్డు ఆఫ్‌ ఎథిక్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ ఫర్‌ ఇండియన్‌ సిస్టం ఆఫ్‌ మెడిసిన్‌.. విభాగాలకు సంబంధించిన బోర్డుల్లో సభ్యులను నియమించడానికి వీలుగా అర్హులైన అభ్యర్థులను ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుంది.
* ఈ బోర్డులన్నీ స్వయంప్రతిపత్తి సంస్థలుగా వ్యవహరిస్తాయి.
* ఆయుర్వేద బోర్డులో అధ్యక్షుడు, నలుగురు సభ్యులుండగా, యునానీ, సిద్ధ బోర్డులో అధ్యక్షుడు, ఇద్దరు సభ్యులుంటారు.
* మెడికల్‌ అసెస్‌మెంట్‌, ఎథిక్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ బోర్డుల్లో ఒక్కో దాంట్లో అధ్యక్షుడితో పాటు ఎనిమిది మంది సభ్యులుంటారు.
* దేశంలో వైద్యవ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో ఈ బోర్డులు క్రియాశీలకంగా పనిచేస్తాయి.