పాల్గొన్న జడ్పీ అధ్యక్షురాలు, డీఆర్వో
సిద్దిపేట, (ఆరోగ్యజ్యోతి): ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో సిద్దిపేట ఎన్జీఓ భవన్‌లో మంగళవారం నిర్వహించిన ఆయుర్వేద వైద్య శిబిరం విజయవంతమైంది. పట్టణంలోని వివిధ ప్రాంతాల నుంచి రోగులు తరలి రాగా వారికి మధుమేహం, రక్తపోటు, సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఔషధాలు అందజేశారు. ఔషధ మొక్కల ప్రాధాన్యం చాటుతూ ప్రదర్శన చేపట్టారు. అందులోని మొక్కలను జడ్పీ అధ్యక్షురాలు వేలేటి రోజాశర్మ, డీఆర్వో చంద్రశేఖర్ పరిశీలించారు. ఈ సందర్భంగా రోజాశర్మ మాట్లాడుతూ...ఆయుష్ ఆధ్వర్యంలో ఆయుర్వేదం ప్రాధాన్యాన్ని వివరిస్తూ వివిధ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. కార్యక్రమ ఇన్‌ఛార్జి వైద్యాధికారిణి దీపాంజలి పెరటి మొక్కల్లో, వంట గది పదార్థాల్లో ఔషధ గుణాలను వివరించారు. సహజసిద్ధ ఆహారం అనే అంశంపై జిల్లా స్థాయిలో నిర్వహించిన వ్యాసరచన పోటీలో విజేతలుగా నిల్చిన వారికి బహుమతులు అందజేశారు. అంతకుముందు బల్దియా కార్యాలయం నుంచి ఎన్జీఓ భవన్ వరకు ఆయుర్వేద నడక చేపట్టారు. కార్యక్రమంలో బల్దియా కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, కౌన్సిలర్ చిప్ప ప్రభాకర్, వైద్యులు సుజాత, ఉమ, రజని, రాధిక, శ్రీనివాస్, విద్యాశాఖ ఏడి లక్ష్మణ్, ఎన్జీఓ భవన్ ప్రతినిధి సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు.