సీజనల్‌ వ్యాధుల నివారణకు ప్రత్యేక చర్యలు


గుంటూరు, (ఆరోగ్యజ్యోతి): మలేరియా, డెంగీ వ్యాధుల నివారణకు ప్రత్యేక ప్రణాళికతో చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని డీఆర్సీ సమావేశ మందిరంలో సోమవారం పురపాలక, వైద్యారోగ్య, పంచాయతీ శాఖల అధికారులతో సమీక్షించారు. జిల్లాలో ఇటీవల డెంగీ, మలేరియా కేసులు ఎక్కువగా నమోదయ్యాయన్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక ప్రణాళికలతో వ్యాధుల నివారణకు కృషి చేయాలన్నారు. ఈ నెల 9 నుంచి ప్రతి రోజూ వ్యాధులు ప్రబలిన ప్రాంతాలకు వెళ్లి ప్రతి ఇంటిని సందర్శించాలని, వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేయాలన్నారు. వర్షపునీరు, మురుగునీరు నిల్వ లేకుండా పనులు చేయించాలని సూచించారు. విధుల్లో అలసత్వం వహించే సిబ్బందిపై చర్యలు తీసుకుంటామన్నారు. అత్యధికంగా మాచర్ల, పిడుగురాళ్ళ, తెనాలి, మంగళగిరి, తాడేపల్లి, నరసరావుపేట, చిలకలూరిపేట ప్రాంతాల్లో ఎక్కువగా మలేరియా, డెంగీ కేసులు నమోదయ్యాయన్నారు. వ్యాధుల నిర్మూలనకు యుద్ధ ప్రాతిపదికన ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు సూచించారు. సమావేశంలో నగర కమిషనర్‌ అనురాధ, వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్‌ యాస్మిన్‌, డీఆర్‌డీఏ పీడీ యుగంధర్‌, పంచాయతీ అధికారి రాంబాబు, పురపాలక శాఖ కమిషనర్లు పాల్గొన్నారు.