రాష్ట్రంలోని 10 జిల్లాల్లో ప్రాథమిక సర్వే
6.47 లక్షల మందికి పైగా బాధితులు ఉండొచ్చని అంచనా
మొదటి స్తానంలో జనగామ జిల్లా
ఐహెచ్‌సీఐ తాజా నివేదిక
హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి): తెలంగాణలో అధిక రక్తపోటు ఉప్పెనలా పెరుగుతోంది. రాష్ట్రంలోని 10 జిల్లాల్లో ప్రాథమికంగా నిర్వహించిన క్షేత్రస్థాయి సర్వేలో 6.47 లక్షలమంది అధిక రక్తపోటు బాధితులు ఉన్నట్లు ప్రభుత్వం అంచనాకొచ్చింది. కేంద్ర కుటుంబ సంక్షేమ శాఖ, భారతీయ వైద్య పరిశోధన మండలి, ప్రపంచ ఆరోగ్య సంస్థ, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా గత ఏడాది నవంబరు నుంచి అధిక రక్తపోటుపై సర్వే నిర్వహించాయి. రాష్ట్రంలోని 10 జిల్లాల్లో 30 ఏళ్ల పైబడినవారిలో రక్తపోటు గురించి జరిపిన ఈ సర్వే ఫలితాలతో 'ది ఇండియా హైపర్ టెన్షన్ కంట్రోల్ ఇనీషియేటివ్ (ఐహెచ్‌సీఐ) పేరుతో నివేదిక రూపొందించాయి. జనగామ జిల్లాలో అత్యధికంగా 17.21 శాతం మంది అధిక రక్తపోటు బాధితులున్నట్లు ఆ నివేదిక పేర్కొంది.
నివేదికలో మరికొన్ని ముఖ్యాంశాలు..
* అధిక రక్తపోటుకు ఔషధాలు వాడుతున్నవారిలో దాదాపు 10-16 శాతంమందికి బీపీ నియంత్రణలో ఉండడంలేదు.
* 35-45 శాతంమంది ఔషధాలను పొందడానికి నెలనెలా ఆసుపత్రులకు రావడంలేదు.
* ప్రత్యేకంగా జనగామ, వరంగల్ పట్టణ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఇలాంటివారు ఎక్కువగా ఉన్నందున అక్కడి వైద్యాధికారులు వారిపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలని నివేదిక సూచించింది.
కొసమెరుపు..
మొత్తం 10 జిల్లాల్లోనూ రక్తపోటు పరీక్షల కోసం డిజిటల్ బీపీ పరికరాలను అందించగా.. సిరిసిల్ల, ములుగు, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో వాటిలో 50 శాతానికి పైగా పనిచేయలేదు.