దోమల నివారణకు చర్యలు
రంగారెడ్డి ,కీసర (ఆరోగ్యజ్యోతి): దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలోని వీఎన్‌ఎస్ హోమ్స్ కాలనీలో పేరుకుపోయిన మురుగును తొలగించేందుకు గురువారం మున్సిపల్ అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. ఆంధ్రజ్యోతి దినపత్రికలో మురుగు సమస్యపై అమ్మో మురుగు శీర్షికన ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఈ మేరకు దమ్మాయిగూడ మున్సిపల్ ప్రత్యేకాధికారి సుధాకర్, కమిషనర్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి, పరిసరాల పారిశుధ్యానికి ఉపక్రమించారు. పెద్ద ఎత్తున పారిశుధ్య సిబ్బందిని నియమించి, మురుగు సజావుగా పారేలా ఏర్పాట్లు చేశారు. మురుగునీటి కుంటలను ఎక్స్‌కవేటర్ సహాయంతో తొలగించారు. మురుగునీటిలో దోమలు వృద్ధి చెందకుండా ఆయిల్ బాల్స్ వేయడంతో పాటు బ్లీచింగ్‌ను చల్లించారు. దోమల నివారణకు నిత్యం ఫాగింగ్ చేస్తున్నామని, వైద్య పరీక్షల నిమిత్తం ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామని అధికారులు తెలిపారు.