హెచ్‌డీఎస్ ఛైర్మన్ చొరవతో లభించనున్న మోక్షం
రోగులకు అందనున్న మెరుగైన వైద్య సేవలు
గాంధీ ఆసుపత్రి, (ఆరోగ్యజ్యోతి): న్యూస్‌టుడే: గాంధీ ఆసుపత్రిలో చాలాకాలంగా మరమ్మతులకు నోచుకోని అత్యవసర యంత్ర పరికరాలకు మోక్షం లభించింది. ఈ మేరకు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ(హెచ్‌డీఎస్) ఛైర్మన్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ మాణిక్‌రాజ్ పచ్చజెండా ఊపారు. తెలంగాణ వైద్యవిద్య మౌలిక సదుపాయాల కల్పన సంస్థ(టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ) ద్వారా యంత్రపరికరాల మరమ్మతులను చేపట్టేలా ఆదేశాలు జారీచేశారు. మంగళవారం ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రావణ్‌కుమార్ నేతృత్వంలోని పాలనాయంత్రాంగం మాణిక్‌రాజ్‌తో సమావేశమయ్యారు.పరికరాలు, వాటి మరమ్మతులు తదితర అంశాలపై చర్చించారు. వాటిలో అత్యవసరమైన వాటి మరమ్మతుల కోసం రూ.4.5 కోట్లు విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ నిధులతో అత్యవసర విభాగంలో ఉన్న 120 పరికరాలకు మరమ్మతులు చేయాలని తీర్మానించారు.
* ఆసుపత్రిలో మొత్తం 36 విభాగాల్లో 2,500 యంత్రపరికరాలుండగా, వాటి నిర్వాహణతోపాటు మరమ్మతులకు గురైతే బాగు చేయాల్సిందిగా ప్రభుత్వం ఓ కంపెనీతో మూడేళ్లకిందట ఒప్పందం చేసుకుంది. సకాలంలో బిల్లులు చెల్లించడం లేదనే కారణంతో వాటి నిర్వహణ, మరమ్మతులను సంస్థ చేపట్టడం లేదు. విషయాన్నిపాలనాయంత్రాంగం డీఎంఈ దృష్టికి తీసుకువెళ్లగా, ఆయన సూచన మేరకు హెచ్‌డీఎస్ ఛైర్మన్ మాణిక్‌రాజ్‌కు పరిస్థితిని వివరించగా నిధులు కేటాయించారు.