ఆరోగ్యశ్రీ పథకంలో మరిన్ని సంస్కరణలు

 


అమరావతి,(ఆరోగ్యజ్యోతి) : ఏపీలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకంలో మరిన్ని సంస్కరణలు అమలు చేస్తామని ఏపీ వైద్యారోగ్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ కె.ఎస్. జవహర్‌రెడ్డి స్పష్టం చేశారు. పేదలకు మేలు జరిగేలా ఆరోగ్యశ్రీని తీర్చిదిద్దాలనేది ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్ష అని వెల్లడించారు. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ కింద 1059 జబ్బులకు చికిత్స అందిస్తున్నారని, త్వరలోనే మరో వెయ్యి జబ్బులను ఈ పథకం కింద చేరుస్తున్నట్లు తెలిపారు.


వచ్చే ఏడాది జనవరి ఒకటి నుంచి పశ్చిమగోదావరి జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టుగా దీనిని అమలు చేయనున్నట్లు జవహర్‌ వెల్లడించారు. అలాగే వచ్చే ఏప్రిల్‌ నుంచి దీర్ఘకాలిక వ్యాదులకు కొత్త ఆరోగ్యశ్రీ కింద రూ. 10వేలు ఆర్థిక సాయం అందించనున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్‌, బెంగుళూరు, చెన్నై నగరాల్లోని 125 ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ పథకం వర్తింపు చేసేందుకు కసరత్తు జరుగుతుందని వెల్లడించారు. రాష్ట్రంలో మందుల కొరత లేకుండా చూడాలని, అన్ని ఆసుపత్రుల్లో కనీస మౌళిక వసతులు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు. ఇప్పటికే 510 రకాల మందులకు ధరలు నిర్ధారించినట్లు పేర్కొన్నారు. 


ఇప్పటివరకు పీపీపీ విధానం ద్వారా నిర్వహించిన వైద్య పరీక్షలను ఇక మీదట ప్రభుత్వమే ఉద్యోగుల ద్వారా చేయించేందుకు చర్యలు ప్రారంభించినట్లు ఆయన వివరించారు. జనవరి నాటికి 400 కొత్త 108 వాహనాలను కొనుగోలు చేస్తామని, రాష్ట్రంలోని ప్రతి మండలానికి 108,104 వాహనాలను సమకూరుస్తామని పేర్కొన్నారు.