భగవాన్ ధన్వంతరి జయంతి వేడుకల్లో వక్తలువేడుకల్లో పాల్గొన్న వైద్య ప్రముఖులు, విద్యార్థులు
వరంగల్ ,లేబర్‌కాలనీ, (ఆరోగ్యజ్యోతి: ఆయుర్వేద వైద్యంతో పేదలకు మరింత మేలు జరుగుతోందని వైద్య ప్రముఖులు వ్యాఖ్యానించారు. భగవాన్ ధన్వంతరి జయంతిని పురస్కరించుకొని 4వ జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని లేబర్‌కాలనీలోని ప్రభుత్వ అనంతలక్ష్మి ఆయుర్వేద కళాశాలలో శుక్రవారం నిర్వహించారు. కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ ఎస్.దుర్గాబాయి ఆధ్వర్యంలో ఈనెల 30 వరకు నిర్వహించనున్న వేడుకలను ఆయుష్ ప్రాంతీయ ఉప సంచాలకుడు డాక్టర్ రవినాయక్ ఉత్సవాలను ప్రారంభించారు. వేడుకలకు ఆయుర్వేద ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జి.పద్మావతి, ఎన్‌ఎంఏ నుంచి డాక్టర్ వేణు, డాక్టర్ పులి సురేశ్, డాక్టర్ ఆర్.జగదీశ్వర్‌ప్రసాద్, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు డాక్టర్ సాంబమూర్తి, నోడల్ అధికారి డాక్టర్ రాజేశ్వరీ బృందం హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. ఆయుర్వేద వైద్యం గొప్పతనాన్ని వివరించారు. దీర్ఘకాలిక వ్యాదులు కేవలం ఆయుర్వేదంతోనే నయమవుతాయని చెప్పారు. తక్కువ ఖర్చుతో దుష్పరిణామాలు లేకుండా రోగాలు నయమయ్యే ప్రక్రియ ఇది అన్నారు. ప్రిన్సిపల్ డాక్టర్ దుర్గాబాయి కార్యక్రమ వివరాలను వెల్లడించారు. ఈనెల 26న ఆయుర్వేద వాక్ వరంగల్ లేబర్‌కాలనీలోని కళాశాల నుంచి వరంగల్ స్టేషన్‌రోడ్డులోని ఆసుపత్రి ప్రాంగణం వరకు ప్రదర్శన ఉంటుందని చెప్పారు. 29న కళాశాల ప్రాంగణంలో హరితహారం నిర్వహిస్తామని వివరించారు. కార్యక్రమంలో వైద్య అధికారులు విజయ్‌పాల్‌రెడ్డి, రాజేందర్, స్వరూపారాణి, విశ్రాంత ఆచార్యుడు రమేశ్, బోధనా సిబ్బంది డాక్టర్ రవీందర్, డాక్టర్ జ్ఞానేశ్వర్, డాక్టర్ అశోక్‌కుమార్, సంధ్యారాణి, సుజాత, కేదారి, భవానీ, చైతన్య తదితరులు పాల్గొన్నారు.