ఆగని వర్షాలు....తగ్గని జ్వరాలు

 











రాష్ట్రంలో విజృంభిస్తున్న దోమలు


ప్రతి ముగ్గురిలో ఇద్దరికి జ్వరం


డెంగీ, మలేరియా జ్వరాలు,  వైరల్‌ ఫీవర్లతో విలవిల


శీతాకాలం ప్రారంభం కావడంతో ఫ్లూ భయం..








హైదరాబాద్‌,(ఆరోగ్యజ్యోతి):   వర్షాలు ఆగట్లేదు. వ్యాధులు తగ్గ ట్లేదు. జనానికి జ్వరాల బాధలు తప్ప ట్లేదు. జూలైలో ప్రారంభమైన జ్వరాలు ఇప్పటికీ తగ్గట్లేదు. ప్రతి ఇంట్లో ఒకరు జ్వరం బారిన పడ్డారు. డెంగీ, మలేరియా, చికున్‌గున్యా జ్వరాలు పట్టిపీడిస్తు న్నాయి. తలనొప్పి, ఒళ్లు నొప్పులు, వాం తులు, విరేచనాలతో భయాందోళనకు గురవుతున్నారు. సెప్టెంబర్‌ చివరి నాటికే వర్షాల తీవ్రత తగ్గిపోవాలి. కానీ అక్టోబర్‌ నెలాఖరుకు కూడా వర్షాలతో రాష్ట్రం తడిసిముద్దవుతోంది. ఇప్పటికీ సాయం త్రం అయిందంటే చాలు అనేకచోట్ల క్యుములోనింబస్‌ మేఘాలతో ఒక్క సారిగా కుండపోత వర్షాలు కురుస్తున్నా యి. ఈ వర్షాలు నవంబర్‌లోనూ కొద్ది రోజులు కొనసాగే పరిస్థితి ఉండటంతో దోమలు మరింత విజృంభించే ప్రమాదం పొంచి ఉంది. రాష్ట్రంలో అధికారిక లెక్కల ప్రకారం ఇద్దరే మృతి చెందినట్లు ఆరోగ్య శాఖ చెబుతున్నా అనధికారిక సమాచారం ప్రకారం డెంగీ కారణంగా కనీసం 150 మందికిపైగా చనిపోయారు. అందులో ఒక్క నిలోఫర్‌ ఆసుపత్రిలోనే ఏడుగురు పసి పిల్లలు డెంగీతో చనిపోయారని అక్కడి వైద్యులే ఆఫ్‌ ది రికార్డు సంభాషణల్లో చెబుతున్నారు. అంకెలను తక్కువ చూపిస్తూ అధికారులు ప్రభుత్వాన్ని పక్కదారి పట్టిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దేశంలోనే డెంగీలో తెలంగాణ రెండో స్థానంలో ఉందని ఏకంగా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ ప్రకటించిందంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు.


ఒకేసారి రెండు వ్యాధుల విజృంభణ..
డెంగీ, చికున్‌గున్యా వానాకాలం సీజన్‌లో వచ్చేవి కాగా, శీతాకాలంలో స్వైన్‌ఫ్లూ పుంజుకుంటుంది. వర్షాల వల్ల వాతావరణం చల్లగా ఉండటంతో డెంగీ, స్వైన్‌ఫ్లూ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. వానాకాలం, చలికాలంలో వేర్వేరుగా వచ్చే ఈ రెండు వ్యాధులు ఇప్పుడు ఒకేసారి రాష్ట్రంలో విజృంభిస్తున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఈ నెల 20 వరకు తెలంగాణలో 1,319 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదు కాగా, 21 మంది చనిపోయారు. దీంతో జ్వరం, తలనొప్పి వస్తేనే ప్రజలు డయాగ్నస్టిక్‌ సెంటర్లకు పరుగులు తీస్తున్నారు. మామూలు జ్వరానికీ పరీక్షల కోసం వేలు ఖర్చు చేస్తున్నారు. ఇదే అదనుగా డయాగ్నస్టిక్‌ సెంటర్లు, వైద్యులు దీన్ని వ్యాపారంగా మార్చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఓ పేరొందిన ఆస్పత్రి వైద్యులు ప్రతి చిన్న దానికి రూ.5 వేలకు మించి పరీక్షలు చేయిస్తున్నారు. దాంతో పాటు వైరల్‌ జ్వరాలతో బాధపడుతున్న వారు మందులు విచ్చలవిడిగా మింగుతున్నారు. అది ఇతరత్రా ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుం దని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


ఫాగింగ్‌ చర్యలు కరువు..
దోమలే డెంగీ, మలేరియా జ్వరాలకు కారణం. ఈ దోమలను నివారించడానికి ఇంట్లో పరిశుభ్రత, నీటిని నిల్వ ఉండకుండా చూడటం ముఖ్యం. చుట్టుపక్కల నీరు నిల్వ ఉంటే అక్కడా డెంగీ దోమలు వ్యాప్తి చెందుతాయి. దోమలను నిర్మూ లించాలంటే నిరంతరం మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు ఫాగింగ్‌ చేయాలి. కానీ ఈ ఏడాది ఫాగింగ్‌ యంత్రాలు పూర్తిస్థాయిలో లేకపోవ డంతో దోమల నివారణ జరగలేదు. దీంతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. ఆ తర్వాత తలెత్తిన పరిణామాలను ఎదుర్కోవడంలో వైద్య, ఆరోగ్య శాఖ విఫలమైంది. చాలాచోట్ల డెంగీ కిట్లను సకాలంలో అందించలేకపోయింది. దీంతో ప్రైవేటు ఆస్పత్రులు కిటకిటలాడాయి. రాష్ట్రంలో ప్రతి కుటుంబం సరాసరి రూ.50 వేల వరకు డెంగీ, చికున్‌గున్యా, ఇతర వైరల్‌ జ్వరాలకు ఖర్చు చేసినట్లు అంచనా. కొన్ని కుటుంబాలైతే రూ.2 నుంచి రూ.4 లక్షల వరకు ఖర్చు చేశారు. కొందరు ప్రత్యేకంగా డెంగీకి బీమా చేయించుకున్నారు.


సాయంత్రం ఓపీకి బ్రేక్‌..
ఏరియా, జిల్లా, బోధనాస్పత్రుల్లో సాయంత్రం వేళల్లోనూ ఓపీ నిర్వహించాలన్న సర్కారు లక్ష్యం నీరుగారుతోంది. ఇప్పటికీ డెంగీ, వైరల్‌ ఫీవర్లు వస్తున్నా సాయంత్రం డాక్టర్లు ఓపీ చూడట్లేదు. అయితే దీనికి రోగులు రావట్లేదన్న కారణం చూపుతున్నారు. ఇక కీలకమైన వైరల్‌ ఫీవర్ల సీజన్‌ కావడంతో కొందరు ప్రభుత్వ వైద్యులు సొంత ప్రైవేటు ఆస్పత్రులకే ప్రాధాన్యం ఇస్తున్నారు.