-పైలట్ ప్రాజెక్ట్ కింద జీహెచ్‌ఎంసీలో ఐదు చోట్ల బిగింపు
చాదర్‌ఘాట్,హైదరాబాద్ (ఆరోగ్యజ్యోతి) : దోమల బెడదతో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. దోమలు స్వైరవిహారం చేస్తుండడంతో నగర వ్యాప్తంగా ఈ సీజన్‌లో దవాఖానాలన్నీ రోగులతో కిక్కిరిసిపోయాయి. దీంతో దోమలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఎటువంటి రకం దోమలు అధికంగా ఉన్నాయి..వాటి సాంద్రత, లింగము, జాతి తదితర అంశాలన్నీ శాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు పైలట్ ప్రాజెక్ట్ కింద జీహెచ్‌ఎంసీ పరిధిలో ఐదు చోట్ల మస్కీట్ అనే యంత్రాలను అమర్చారు. వీటి ద్వారా ఎంటమాలజీ విభాగం అధికారులు చర్యలు తీసుకుంటారు. మస్కీట్ దోమలను పట్టుకునే యంత్రం పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా పని చేస్తుంది. జనసందోహం, పార్క్‌లు, ఖాళీ ప్రదేశాలు తదితర సురక్షిత ప్రాంతాల్లో మస్కీట్ యంత్రాలను బిగించనున్నారు.
ముందుగా ప్రయోగాత్మకంగా గుర్తించిన కొన్ని చోట్లలోనే జీహెచ్‌ఎంసీ అధికారులు వీటిని అమర్చారు. మస్కీట్‌లను క్లౌడ్-సర్వర్-వినియోగదారుడికి ఆన్‌లైన్ ద్వారా పని చేసేలా ట్రాక్ ఇట్ నౌ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ దీనిని తయారు చేసింది. ఐఓటీ(ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) పరికరంగా గుర్తించి వీటి పనితీరును సంబంధిత అధికారులు పరిశీలిస్తున్నారు. మస్కీట్‌ను అమర్చని ప్రాంతం నుంచి దాదాపు 500 మీటర్ల వ్యాసార్థంలో ఉన్న ఖాళీ ప్రదేశంలోని దోమలను ఈ యంత్రం ఆకర్శిస్తుంది. ఇందులో చేరిన వెంటనే దోమల రెక్కల తరంగాల లెక్కింపు ద్వారా ఎటువంటి దోమ అని గుర్తించే విధంగా సెన్సార్‌ను అమర్చినట్లు ట్రాక్ ఇట్ నౌ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధి ఉస్మాన్ పటేల్ తెలిపారు. ఎటువంటి అడ్డంకులు లేని చోట 500 మీటర్ల వ్యాసార్థం వరకు దోమలను ఆకర్శిస్తాయి. అదే బహుళ అంతస్తులు, ఇండ్ల మధ్య బిగిస్తే దాదాపు 200 మీటర్ల వరకు ఆకర్శించే సామర్థ్యం కలిగి ఉంటుందని ఆయన తెలిపారు. మస్కీట్ యంత్రంలో చాంబర్లలో అమర్చిన సెన్సార్‌ల ద్వారా దోమల జాతిని కూడా స్పష్టంగా గుర్తించే వెసులుబాటు ఉన్నది.