విజయవాడ ,(ఆరోగ్యజ్యోతి): ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోన్‌రెడ్డి వివిధ అంశాలపై మంగళవారం వీసీ నిర్వహించారు. నగరంలోని విడిది కార్యాలయం నుంచి కలెక్టరు ఇంతియాజ్ పాల్గొని మాట్లాడారు. ఈ నెల 10వ తేదీ నుంచి విద్యార్థులకు కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు సీఎంకు తెలిపారు. 15వ తేదీ వరకు నిర్వహించే ఈ కార్యక్రమం కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్టు పేర్కొన్నారు. జిల్లాలో 6,34,374 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో 5 శాతం (30వేల) మందికి కంటి వైద్య చికిత్స అవసరమని అంచనా వేసినట్టు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసినట్టు తెలిపారు. సీఎం అడిగిన ప్రశ్నకు కలెక్టరు బదులిస్తూ.. 4,800 ప్రైవేటు పాఠశాలల వివరాలు కంప్యూటరులో నిక్షిప్తం చేస్తున్నట్లు చెప్పారు. డాక్టరు ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రి, శంకర నేత్రాలయం వంటి సంస్థలు తోడ్పాటు అందిస్తున్నాయని వివరించారు. జేసీ కె.మాధవీలత, జేసీ-2 మోహనకుమార్ తదితరులు పాల్గొన్నారు.